Sunday 6 December 2015

మాయమైన మనుషుల కోసం - ఇఫ్ఫత్ ఫాతిమా



ఇది కశ్మీర్ కన్నీటి గాథ...
రాజకీయ పరిష్కారం కావాలి

మాయమైన మనుషుల కోసం సాగే అన్వేషణ. రోజులు..నెలలు.. సంవత్సరాలు.. దశాబ్ధాలు గడిచిపోతాయి. కానీ ఆ అన్వేషణకు ముగింపు మాత్రం కనబడదు. ఒక్కరిద్దరు కాదు..దాదాపు 20వేల మంది అదృశ్యమయ్యారక్కడ. భర్తకు దూరమైన భార్య.. అన్నను కోల్పోయిన తమ్ముడు.. తండ్రి తలుచుకునే కూతురు..బిడ్డను పోగొట్టుకున్న తల్లి.. ఇలా ఎందరెందరో. లక్షలాది మంది తమ రక్త సంబంధీకుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏమయ్యారు... వాళ్లందరూ? ఎక్కడికి పోయారు? అసలు.. బతికున్నారా? తిరిగొస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలుండవు. గుమ్మానికి ఎదురు చూపులు మిగిలే ఉంటాయి. చెల్లని చట్టాల సాక్షిగా... పదే పదే న్యాయస్థానాలు వెక్కిరిస్తుంటాయి. ఈ కన్నీటి గాథ వెంట సుదీర్ఘ ప్రయాణం చేసిందామె. తుపాకీ నీడన తెల్లవారే రాత్రి ఎన్నెన్ని విషాదాల్ని మిగిల్చిందో కళ్లకు కట్టింది. ఆమే...కశ్మీరీ ఫిల్మ్‌మేకర్ ఇఫ్ఫత్ ఫాతిమా. కల్లోల కశ్మీరాన్ని తొమ్మిదేళ్లపాటు శ్రమకోర్చి దృశ్యమానం చేసింది. కూన్ దీయ్ బారవ్ పేరిట ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం లామకాన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను నమస్తేతెలంగాణతో పంచుకుంది. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం తప్ప సాయుధ పరిష్కారం సాధ్యంకాదంటున్న ఫాతిమా చెప్పే ముచ్చ‌ట్లు ఆమె మాటల్లోనే.


అదృశ్య‌మైన వాళ్లెంద‌రో...
మనుషులు మాయమవ్వడం ఓ గంభీరమైన సమస్య. కశ్మీర్‌లో నిత్యకృత్యంగా మారిన ఈ అంశాన్నే వస్తువుగా తీసుకొని డాక్యుమెంటరీ రూపొందించాలనుకున్నా. కౌంటర్ ఇన్సర్జెన్సీ పేరిట కశ్మీర్‌లో జరుగుతున్న హక్కుల అణచివేతను ప్రపంచానికి చాటాలని ప్రయత్నించా. ఒక్క వ్యాలీలోనే ఇప్పుటి వరకు 10వేల మందికిపైగా అదృశ్యమయ్యారు. వాళ్ల కుటుంబాల ఆరాటాన్ని, పోరాటాన్ని నా చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకునేందుకు  ఆ కుటుంబ సభ్యులతో కలిసి సుదీర్ఘ సమయం గడిపాను. ఈ ప్రయత్నంలో నా డాక్యుమెంటరీ పూర్తవడానికి దాదాపు 9 ఏళ్ల సమయం పట్టింది.
వెతలతో ముడిపడిన జీవితం
నేను కశ్మీరీ మహిళను. అక్కడి వెతలతో ముడిపడిన జీవితం నాది. అందుకే ఈ కథను ఎంచుకున్నా. అందుకోసం నెలల తరబడి, ఏళ్ల తరబడి బాధిత ప్రజలతో గడిపి...వాస్తవాల్ని చిత్రించేందుకు ప్రయత్నించాను. ఇత రక్త సంబంధీకుల్ని కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ కన్నీళ్లను కూడా దాచుకోవాల్సిన స్థితి. తమ ఆవేదను కూడా స్వేచ్ఛగా ప్రకటించలేని భయానక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వాటి చిత్రీకరణకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న. అక్కడ నిజానికి మిలింటెంట్‌లు గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు లేరు. అయినా... మిలిటెంట్ల సాకుతో సామాన్యులపై జరుగుతున్న ఆకృత్యాలు అన్నిఇన్ని కావు.
ఉమ్మడి పోరాటం
కశ్మీర్‌లో ప్రతి కుటుంబం ఓ కన్నీటి కథ వినిపిస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా ఎడతెగని ఎదురుచూపులు వాళ్లవి. ఆత్మీయులను కోల్పోయిన వాళ్లంతా ఒక చోట చేరి ఉమ్మడి పోరాటం సాగిస్తున్నారిప్పుడు. అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ డిసప్పియర్డ్ పర్సన్స్ (ఏపీడీపీ)  పేరుతో సంఘంగా ఏర్పడి తమ గొంతు వినిపిస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా ప్రతి నెల ఒక చోట చేరి తమ దుఃఖాన్ని పంచుకుంటున్నారు. గొంతెత్తి నినదిస్తున్నారు. అదృశ్యమవ్వడం అనేది నేరంగా గుర్తించని దేశంలో..వాళ్లు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి కథలెన్నో..నా చిత్రంలో కనిపిస్తాయి.


 ప్రపంచ సమస్య
నిజానికి ఇది ఒక్క కశ్మీర్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. మధ్య భారతం, ఈశాన్య భార తం, శ్రీలంక, లాటిన్ అమెరికా ఇలా... ప్రతీ చోట అణచివేతను ప్రయోగిస్తున్నాయి ప్రభుత్వాలు. అణచివేత ద్వారా సమస్యను దాచిపెట్టాలనుకుంటే సాధ్యం కాదు. మిలిటరీకి ఆర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ పేరిట ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి కశ్మీర్‌ని కల్లోల ప్రాతంగా మార్చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితి.
 రాజ్య స్వభావం
రాజ్యస్వభావమే అలాంటిది. ఎక్కడైనా ప్రశ్నించడాన్ని సహించదు. ప్రభుత్వాలే ప్రజల హక్కుల్ని కాలరాయడం విషాదం. తమ సొంత ప్రజలపైనే మిలటరీని ప్రయోగించి రోజువారి జీవితాల్ని సైతం దుర్భరంగా మార్చేస్తున్న వైనం సరైంది కాదు. ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాల్సి ఉంటుంది. ఒక సుదీర్ఘ పోరాటాన్ని తుపాకీ నీడన తొక్కిపెట్టాలనుకోవడం సరైంది కాదు.
 రాజకీయ పరిష్కారం కావాలి
నిజానికి కాశ్మీర్ సమస్య..రాజకీయ సమస్య. దాన్ని రాజకీయంగా మాత్రమే పరిష్కరించాలి. తప్ప ఆయుధాలతో పరిష్కరించలేరు. మిలిటరైజేషన్ కృరత్వానికి దారితీస్తుంది తప్ప...పరిష్కారానికి కాదు. దేశ విభజన కాలం నుంచి అక్కడ సమస్య ఉంది. గడిచిన ఆరు దశాబ్ధాలకు పైగా అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా పరిష్కార దిశలో అడుగులు వేయలేదు. అందువల్లే అది హింసకు దారితీసింది. ఫలితంగా ప్రజలు నిత్యం భయం గుప్పిట బతకాల్సిన స్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు గౌరవించాలి.


- క్రాంతి, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

Monday 30 November 2015

The City Never Sleep



భాగ్యనగరం..ముత్యాల రాశుల ఉద్యానవనం. రాతి శిలలపై వెలిసిన రాజ భవనాలిక్కడ.. నది ఒడ్డున నిలిచిన శ్వేత సౌధాలిక్కడ.. ఇరానీ రుచుల మలాయి మీగడలు... బిర్యానీ గుమగమలు... ఉస్మానియా బిస్కెట్లు.. ముషాయిరాల వాహ్వాలు. చెప్పుకునేవి..తెలుసుకునేవి ఎన్నెన్నో ఈ మహానగరంలో. అందుకే... హైదరాబాద్ అందమైన పాలరాతి శిల్పం. కవి గాయక కళా నిలయం. భాగమతి కాలి అందెల సవ్వడికి జతకూడిన కుతూబ్ గీతం ఈ నగరం. ప్యాలెస్‌లు, దేవ్డీలు, కోఠీలు, కమాన్‌లు, దర్గాలు, మందిరాలు ఇలా అడుగడుగునా కొలువుదీరిన కట్టడాలెన్నో ఈ నేల మీద. అవి వినిపించే చారిత్రక గాథలు ఎన్నెన్నో. నిద్రపోని చందమామని భుజానేసుకొని.. ఆదివారం రాత్రంతా పురాస్మృతుల్లో పయనించిందీ నగరం. వరల్డ్ హెరిటేజ్ వీక్‌లో భాగంగా హైదరాబాద్ ట్రాయిల్స్ నిర్వహించిన నైట్ వాక్‌లో... వందలాది మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విదేశీయులు చార్మినార్ చెంతచేరి చరిత్రతో కరచాలనం చేశారు. అలా నిషీధి   రేయి ఉషారు గీతం ఆలపించింది నిద్రపోని నగరం.


నది ఒడ్డున నిల్చున్న అతని మదిని ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. ఎదురుగా ఉస్మానియా దవాఖాన. ఇంచుమించు వందేళ్ల వయసుంటుంది కాబోలు. ఎన్ని లక్షల ప్రాణాలిక్కడ పదిలమయ్యాయో. ఎన్ని శ్వాసలిక్కడ ఆగిపోయాయో. ఎన్నెన్ని జీవితాలు... ఇక్కడి నుంచే ఆరంభమయ్యాయో. చూడముచ్చటైన నిర్మాణం కదా... నిజాం ఆలోచనకు రూపురేఖలిచ్చిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ విన్సెంట్ ఇన్నేళ్లుగా నగరంలో సజీవంగానే ఉన్నట్లుంది. రేపటిసంగతేమో కానీ... ఇప్పటికైతే అతనికిది నది ఒడ్డున దిగిన పాలపుంత. ఇంతలోనే ఎవరో పిలిచినట్లుగా.. పురానాపూల్ దాటుకొని సాలార్జంగ్ మ్యూజియం వైపు అడుగులేశాడు. అదిగో...లోపలి నుంచి ఏవేవో శబ్ధాలు. చరిత్రని సజీవంగా పదిలపరిచిన వస్తుసామగ్రి గుసగుసలు. కాస్తముందుకెళ్లి నయాబ్ హోటల్ చేరుకున్నాడు. అంతే...వెలుగు పూల జాతరలో కలియతిరిగేందుకు రెండు పాదాలకు తోడు రెండు వందల పాదాలు జతకూడాయి.




ఇరానీ గుమగుమలు..
యే షహర్ నిషానీ హై ఇరానీ చాయ్. నయాబ్ హోటల్‌లో నడక సాగిస్తే... మలాయి పౌనా గుమగుమలు మనసును మెలిపెడతాయి. వంట గదిలో రుమాలీ రోటీ గాలిలోకెగురుతుంటుంది. కట్టెల పొయ్యి మీద మరుగుతున్న పాలు...మత్తుగొలుపుతాయి. కప్పులో చాయ్‌ని గుటకేసేలోపు గోపాలకృష్ణ ఏవేవో కథలు వినిపించాడు. యే షహర్ కీ కహానీ.. రెపరెపలాడే జెండాపై కుల్చా ఎందుకు కొలువుదీరిందో... ఏడు తరాల నిజాం కథని నిమిషాల్లో వినిపిస్తాడు. నయాబ్ హోటల్ వెనక గల్లీలోంచి నడుస్తు ఉంటే...చత్తా బజార్ చరిత్ర మనకు తారసపడుతుంది. తొలినాటి ముద్రణ ముచ్చట్లు ఔరా అనిపిస్తాయి. 



చరిత్రలోకి..
మదీనా వైపు అడుగులేస్తుంటే... పత్తర్‌గట్టీ పలకరిస్తుంది. చుట్టుపక్కల చూపు సారిస్తే... కాస్త దూరంగా దివాన్‌దేవ్డీ దర్శనమిస్తుంది. మీర్ చౌక్ రోడ్డు మురిపిస్తుంది. ప్రతి కట్టడానికీ ఓ కథ ఉన్నట్లే... గల్లీ గల్లీ ఓ గాథ ఉంది. నాటి ఊసులన్నిటినీ కళ్లముందు కుప్పపోసి ఒక్కొక్కటి వినిపించింది అరుణిమా. చార్మినార్‌కు నలుదిక్కులా నిలిచిన ద్వారాలు స్వాగతమంటాయి. కాలీ కమాన్ చెప్పే కథలు వింటూ...మచిలీ కమాన్ ముచ్చట్లు వింటూ... షేర్ ఏ బాటిల్ కమాన్...లోంచి చార్ కమాన్ వైపు నడక సాగిస్తే నాలుగు వందల ఏళ్ల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. దారి మధ్యలో రోడ్డుపక్కన టిఫిన్ బండి, అక్కడ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ నోరూరిస్తాయి.



వెలుగు పూలు..
చార్మినార్ చెంత చేరితే... వెలుగు పూలు స్వాగతమంటాయి. నక్షత్రాల నీడలో చందమామతో చెలిమి చేస్తూ నిశ్చలంగా నిలుచున్న నాలుగు వందల ఏళ్ల నగర నిశానీ ఇది. పక్కనే మక్కా మసీదు... ముచ్చటగా పిలుస్తుంది. ఎదురుగా యునానీ ఆసుపత్రి పాలపుంతలా వెలుగుతుంది. వారెవ్వా ఇన్ని అందాల్ని ఎక్కడ చూడగలం. ఒక్క బాగ్‌నగర్‌లో తప్ప. రాతిరంతా మేల్కొని.. చందమామకు సోపతిగుండే సిటీ ఇది. ఇంత అందమైన నగరంతో ప్రేమలో పడని వారెవరుంటారు. అందుకే... రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలు...దేవకొండ బాలగంగాధర్ తిలక్.... సరోజినీ నాయుడు వరకు ఎందరెందరో కవులు...నగర అందాలకు తమ అక్షరసుమాలర్పించారు. మీరూ ఈ రాత్రిపూల వెలుగులో నగర అందాల్ని వీక్షించాలనుకుంటున్నారా..! అయితే పాతబస్తీ వైపు పాదాల్ని తిప్పండి.


మై ఏక్ ముసాఫిర్ హూ : థియేటర్ ఆర్టిస్ట్, ట్రావెలర్ అక్రమ్ ఫిరోజ్

నాకు సరిహద్దులు నచ్చవు

 

 

మతాలు, ప్రాంతాలు, మాంసాల గురించి పోట్లాడుకుంటున్న కాలంలో అతను మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. సరిహద్దులు లేని సమాజం గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసం... అన్వేషణ సాగిస్తున్నాడు. ఊళ్లు, నగరాలు, జిల్లాలు, రాష్ర్టాలు, దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేయాలని కలగంటున్నాడు. వరల్డ్ విత్ అవుట్ బార్డర్ అంటూ సైకిల్ పై సవారీ సాగిస్తున్నాడు.  సరిహద్దుల పేరిట సాగే యుద్ధాల్ని సవాల్ చేస్తున్నాడు. అందుకు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చినా లెక్కచేయలేదు. పాకిస్తాన్, చైనా, టిబెట్, నేపాల్, భూటాన్ ఇలా దేశదేశాల సరిహద్దుల్లో తన స్వేచ్ఛాగీతాన్నాలపించాడు. థియేటర్ ఎట్ బార్డర్ అంటూ ఊరూరా నాటకాల్ని ప్రదర్శించాడు. అతడు ఎవరో కాదు.. హైదరాబాదీ థియేటర్ ఆర్టిస్ట్ అక్రమ్ ఫిరోజ్. 10వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టొచ్చిన అక్రమ్ ఈసారి మోటర్ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..



మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. సిటీ అరోరా కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. బీఎస్సీ జెనెటిక్స్. మధ్యలోనే వదిలేశాననుకోండి. నాకు నాటకాలంటే ఇష్టం. డిగ్రీ వదిలేశాక కొంతకాలం వాటితోనే గడిపాను. కొంతకాలం మీడియాలో చేశాను. ఈ క్రమంలోనే భిన్న సంస్కృతులు... ప్రాంతాలు... ప్రజలను గురించి తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. అందుకోసం దేశంలోని వేరువేరు ప్రాంతాలు చుట్టిరావాలనుకున్నాను. కానీ అందుకయ్యే వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత కూడా లేదు. అప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకున్నాను. సైకిల్ మీదే దేశాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకున్నాను. వేరువేరు ప్రాంతాలను, ప్రజలు, సంస్కృతులు, సమస్యల్ని అధ్యయనం చేసేందుకు కూడా సైకిల్ యానం సరైందనిపించింది. అలా నేను 2011లో నా సైకిల్ జర్నీ ఆరంభించాను. ఈ ప్రయాణంలోని అనుభవాలే కొత్త ఆలోచనలకు... అన్వేషణకు పునాది వేశాయి. 



10వేల కిలోమీటర్లు...
అలా మొదలైన ప్రయాణం దాదాపు 10వేల కిలోమీటర్లు సాగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అండమాన్, లక్షద్వీప్, మహారాష్ట్ర ఇలా దక్షణాది రాష్ట్రాలన్నీ సైకిల్ మీదే తిరిగాను. ట్రక్కులు, లారీలు లిఫ్ట్ తీసుకుంటూ మరో 60 వేల కిలోమీటర్లపైనే ఈ నాలుగేళ్లలో తిరిగాను. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు చాలా గొప్పవి. ఆకలి దప్పులు, రోగాలు నొప్పులు వంటివి సాధారణ విషయాలే. కానీ... నిత్యం కొత్తకొత్త సమస్యలు ఎదురయ్యేవి. అయినా నేనెప్పుడూ నా జర్నీ సాఫీగా సాగుతుందని ఆశించలేదు. ఈ ప్రయాణంలో నన్ను ఆదరించి ప్రజలు... వాళ్లు పంచిన ప్రేమ గొప్పది. కాకపోతే.. నాలాంటి ఒక బాటసారి పట్ల ఈ వ్యవస్థ వైఖరి నన్ను పదే పదే ఆశ్చర్యానికి గురిచేసేది. వెళ్లిన ప్రతీచోట ఎక్కడినుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం ప్రయోజనం? ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యేవి. వీటికి తోడు కొన్నిచోట్ల  ఆంక్షలుండేవి. ఇక్కడ తిరగొద్దు... అటు వెళ్లొద్దు లాంటివి. ఈ ప్రశ్నలు.. ఈ ఆంక్షలే నాలో కొన్ని ఆలోచనలు లేవనెత్తాయి. 



ఎందుకీ సరిహద్దులు
గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లేకొద్దీ సరిహద్దుల సమస్య ఎదురయ్యేది. ఇది మన రాష్ట్రం.. అది పరాయి దేశం ఇలా. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లకూడదు లాంటి ఆంక్షలు. ఎందుకనే ప్రశ్నకు సరైన సమాధానముండదు. ఈ ప్రపంచ పౌరుడిగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా విహరించే హక్కు నాకుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ ఆర్టికల్ 13(2)ప్రకారం స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ దాన్ని ఏ దేశమూ అనుమతించదు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలంటుంది. కానీ నా వద్ద వరల్డ్ పాస్‌పోర్ట్ ఉంది. నేను నా కాళ్లతో నడిచి ఈ ఊరి నుంచి మరో ఊరికి వెళ్తున్నాను. అందుకు నీకెందుకు డబ్బులు చెల్లించాలి? నీ అనుమతి ఎందుకు తీసుకోవాలి? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న కేంద్రంగానే ప్రయాణం సాగుతూ వచ్చింది. 



సైకిల్ నాటక్
నేను వెళ్లే ప్రతిచోట స్థానిక సమస్యల్ని తెలుసుకోవడం, అక్కడి పిల్లలతో కలిసి నాటకాల్ని ప్రదర్శించడం ఆరంభించాను. అదే సైకిల్ నాటక్. ఇలా కొత్త విషయాల్ని తెలుసుకుంటూ కొత్తకొత్త నాటక రీతుల్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటాను. చైనా - ఇండియా బార్డర్, పాకిస్తాన్ -ఇండియా బార్డర్, భూటాన్ ఇండియా బార్డర్, నేపాల్ -ఇండియా బార్డర్‌లో ఇలా అనేక ప్రదర్శనలు చేశాను.  స్థానిక ప్రజల్ని, పరిసరాల్ని నాటకంలో భాగం చేస్తూ... ఇన్‌విజిబుల్ థియేటర్ ప్రయోగం చేశాను. ఈ క్రమంలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యాయి. ప్రమాదాలు జరిగాయి. అండమాన్‌లో 20ఫీట్ల ఎత్తు నుంచి లోయలో పడ్డాను. సైకిల్ పాడైపోయింది. రోడ్డుపక్క ఎవరో తాగి గొడవ పడతారు. నా కెమెరా దొంగిలించారు. అనారోగ్యం బారినపడ్డాను. నేను లిఫ్ట్ తీసుకున్న వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. ఇలా ఎన్నో. అయినా ప్రతీచోట ప్రజలు ఏదో రూపంలో నన్ను ఆదరించారు. వాళ్ల అనుభవాలను, అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. నా ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని అందించారు. అందుకే ఇన్ని వేల మైళ్లు ప్రయాణం చేయగలిగాను. 


జైలు గోడలు
గత ఆగస్టులో రాజస్తాన్‌లో పర్యటిస్తున్నాను. జగల్ మేర్ జిల్లా రాంఘడ్ పట్టణం. పాకిస్తాన్ సరిహద్దుకి 30కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పిల్లలతో నాటకం వేసి తిరిగి వెళ్తుండగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నందుకు అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నన్ను నేను కళాకారుడిగా, ట్రావెలర్‌గా పరిచయం చేసుకున్నప్పటికీ వాళ్లు విశ్వసించలేదు. ఎలాంటి చార్జిషీట్ లేకుండా 8 రోజుల పాటు కస్టడీలో ఉంచుకున్నారు. తరువాత 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మా అన్నయ్య అక్కడి వచ్చి బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టులో ఫైల్ స్వీకరించేందుకు తిరస్కరించారు. చివరకు హక్కుల సంఘాల చొరవతో బెయిల్ పిటిషన్ స్వీకరించి రెండువారాల తరువాత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. సరిహద్దులుండొద్దన్నందకు జైలుగోడల మధ్యకు వెళ్లాల్సి వచ్చింది. రంగు, రూపు, జాతి వేరు కావచ్చు కానీ అందరూ మనుషులే. వాళ్ల మధ్య హద్దుల్ని గీసి... యుద్ధాలు చేసుకోవడం ఎందుకు? అభిప్రాయ బేధాలుంటే... చర్చించుకోవాలి తప్ప యుద్ధాలు చేసుకోవద్దు. సమానత్వం కోసమే సంఘర్షణ అంతా. మనం సమానత్వం సాధించే నాటికి మనుషులు మిగలకపోతే? అలాంటి స్థితి రాకూడదనే ఆ ఆకాంక్ష. నేను సామాన్య కళాకారుడిని. కళకు ఎల్లలుండవు. నేను అదే విశ్వసిస్తాను. అందుకోసమే నా ఆరాటం. 



మరో ప్రస్థానం
జైలు నుంచి వచ్చాక నాలుగు నెలలు విరామం తీసుకున్నాను. ఈ సారి నా ప్రయాణం బైక్‌మీద. దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నాను. స్విట్జర్లాండ్‌కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ లియా కూడా ఈ ప్రయాణంలో నాతో పాటు వస్తోంది. మేము రూపొందించిన ది లోన్ కాంక్వెరర్ నాటకాన్ని ఈ సందర్భంగా పలు పట్టణాల్లో ప్రదర్శించనున్నాం. యుద్ధం-శాంతి గురించి చర్చించే ఈ నాటకాన్ని వచ్చే రెండునెలల్లో పూణే, జైపూర్, భోపాల్, ఢిల్లీ, చంఢీఘడ్ నగరాల్లో ప్రదర్శిస్తాం. భోపాల్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో మా నాటక ప్రదర్శన ఉంటుంది. డిసెంబర్ 1న ఈ జర్నీ ప్రారంభమవుతుంది. జనవరి 31 వరకు సాగుతుంది.

Monday 16 November 2015

క‌విత్వం కురిసిన ఉద‌యం..


పాత‌న‌గ‌రంలో ప్ర‌భాత‌గీతం... దర్గాపై రెపరెపలాడిన సూఫీ సంగీతం



ఇంకా... నగర జనం మేల్కొలేదు కాబోలు. పాతబస్తీ వీధులు ప్రభాత గీతం వినిపిస్తున్నాయి. తంబూర మోతకు దో తారా జత కూడింది. విపుల్ గాత్రానికి షబ్నం కోరస్ అయ్యింది. దారుషిఫా దర్గాలో కబీర్ కవిత్వం కురుసింది. ఈ ప్రభాత గీతం... నిద్రపోతున్న వాళ్లన్ని మేల్కొల్పడానికి కాదు... మనుషులుగా మరణిస్తున్న వాళ్లకు మానవత్వాన్ని గుర్తుచేయడానికి. అవును.. ఆదివారం ఉదయం... పాతబస్తీకి సూఫీ పరిమళం సోకింది. అది హైదరాబాద్ ట్రాయిల్స్ అంటించిన సంగీత సంచార జ్వరం. ఆ జ్వర తీవ్రత మీకూ అంటుకోవచ్చు.



మీరెప్పుడైనా చరిత్రలోకి తొంగి చూశారా? పాతనగరం వీథుల్లో... పాడుబడిన రాతి గోడను పలకరించారా? గోడపై పరుచుకున్న పచ్చని నాచుని మునివేళ్లతో తడిమి చూశారా? వేనవేల అనుభవాలు కథలు కథలుగా వినిపిస్తాయి. శతాబ్ధాల చరిత్ర కళ్లమందు స్క్రోల్ అవుతుంది. అక్కడే ఆగిపోయేరు సుమా! మీ చెవుల్లోకి సుస్వర గీతమొకటి చొరబడి కలవరపెడుతుంది. చరిత్రతో మీ సంభాషణకు అంతరాయం కలిగిస్తుంది. ఇంతలో.. అటు పక్క నుంచి ఎవరో పలకరిస్తారు. ఏవేవో ముచ్చటిస్తారు. అలా.. మూల మలుపు తిరగ్గానే... ఇరానీ ఛాయ్ ఈల వేస్తుంది. వీధి చివర.. గులాబీ జామ్ తరసపడుతుంది. ఇంతకూ ఏమవుతుందో తెలుసా.. ? మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఆదివారం సూఫియానాలో పాల్గొన్న వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 


సూఫియానా
ఇంతకూ సూఫియానా సంగతేంటనుకుంటున్నారా? అక్కడే వస్తున్నా. భారతీయ సంస్కృతిలో భాగమైన భక్తి ఉద్యమం, సూఫి తత్వం జనసామాన్యానికి కొత్త చూపునిచ్చాయి. కుల, మతాల అంతరాలను కూలదోసి... మనవత్వాన్ని పరిమళించాయి. అలా.. సమానత్వ భావాల్ని వెదజల్లిన కవి, గాయకులు ఎందరెందరో. వాళ్లు బోధించిన విలువల్ని ఇప్పటికీ పలువురు ఆచరిస్తున్నారు. ఉత్తర భారతంలో ప్రభాత్ ఫేరి పేరుతో తెల్లవారుజామున భక్తి గీతాలాలపిస్తూ నగరమంతా సంచరిస్తుంటారు సూఫీ గాయకులు. ఇప్పుడు నగరంలోనూ సూఫియానా పేరుతో... అలాంటి సంగీత సంచారానికి తెరతీసింది హైదరాబాద్ ట్రాయిల్స్. సూఫీ గీతాల్ని ఆలపిస్తూ ఓల్డ్ సిటీలోని చారిత్రక దర్గాల్ని సందర్శించడం సూఫియానా ఉద్దేశ్యం. వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మందికిపై విద్యార్థులు, ఉద్యోగులు ఈ సూఫీవాక్ పాల్గొని సంగీత సాగరంలో మునిగిపోయారు. 



చారిత్రక నగరంలో...
హైదరాబాద్ చారిత్రక నగరం.. నాలుగు వందల ఏళ్ల పైబడిన చరిత్ర ఈ నగరం సొంతం. ఎన్నో చారిత్ర కట్టడాలు. మసీదులు.. మందిరాలు.. దర్గాలు. భక్తి ఉద్యమం, సూఫీయిజంతోనూ విడదీయరాని బంధం. అలాంటి నగరంలో సూఫీ తత్వాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నయే సూఫియానా( సంగీత సంచారం). ఆదివారం ఓల్డ్‌సిటీలోని దారుషిఫా దర్గా నుంచి మొదలై పలు చారిత్రక దర్గాల మీదుగా ఈ సంగీత సంచారం సాగింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ షబ్నం, రచయిత విపుల్‌తో పాటు సూఫీ కళాకారులు నీల్, ప్రేమ్‌సాగర్, రాహుల్, మల్లిక్‌లు తమ సంగీతంతో శ్రోతలను అలరించారు. దారుషిఫా నుంచి చెత్త కమాన్, దివాన్ దేవిడి, అల్లాడిన్ బిల్డింగ్, ఉర్దూ గల్లీ, మచిలీ కమాన్, ఇరానీ గల్లీ, మీరాలం మండి మీదుగా గుల్జార్ హౌజ్ వరకు సాగిన సూఫియానా వాక్‌లో పలు చారిత్రక దర్గాలతో కరచాలనం చేశారు. మధ్య మధ్యలో కళాకారులు కబీర్, కృష్ణ గీతాలతో అలరించారు. తంబూర శబ్ధం, గిటార్ ధ్వనికి దోతార జతకూడుతుంది. వెదురు పవనపు గీతమై డిడ్జెరిడూ మైమరిపించింది. సూఫీ సంగీతాన్ని వింటూ మైమర్చిపోయారు నగరవాసులు.



మధురానుభూతులు
సూఫియానాలో కొత్త కొత్త పరిచయాలు. భిన్న సంస్కృతుల మధ్య ఆధాన ప్రధానాలు. ఎన్నెన్నో సంభాషణలు. దారి మధ్యలో నయాబ్ హోటల్ సేదతీరమంటుంది. వంట గదిలో... కట్టెల పొయ్యిపై మరిగే పాలు గుమగుమలాడుతాయి. ఇరానీ ఛాయ్ వాహ్వా అనిపిస్తుంది. పత్తర్‌గట్టి రోడ్డులో.. పాత సామాను పరిమళం సోకుతుంది. మచిలీ కమాన్ ముందు వేడి వేడి గులాబీజామ్ గుమగుమలాడుతుంది. అర్కిటెక్చర్ విద్యార్థులు... మినారు నుంచి వేలాడే చెట్ల ఆకుల్ని చిత్రిస్తుంటారు. అలా మాటలు.. పాటలు.. చారిత్రక ఊసులు.. మదినిండా నింపుకొని చార్మినార్ సాక్షిగా.. సూఫియానా సెలవందిస్తుంది. ఇది పాత బస్తీ ప్రభాత గీతం.. ఎన్నెన్ని మధురానుభూతులో. మళ్లీ మళ్లీ సొంతం చేసుకోవాలనిపించే సంగతులు. ఇది పురానా షహర్ పులకింత. 





 అవి భక్తి కీర్తనలైనా... సూఫీ గీతాలైనా... మానిషితనాన్ని ప్రేమించేవే. అవి ధిక్కార స్వరాలు.. ఆధిపత్యాన్ని ప్రశ్నించిన గొంతుకలు. మానవత్వాన్ని చాటిన ఉద్యమాలు. మతాలు, కులాల మధ్య అంతరాలను తుడిచేసిన మాద్యమాలు. సమానత్వాన్ని బోధించిన జన జీవన విధానాలు.. అతను కబీరు కావచ్చు.. గురు నానక్ కావచ్చు... అన్నమయ్య కావచ్చు.. మీరాబాయి కావచ్చు. వాళ్లు మనలో కొత్త ఆశల్ని చిగురింపజేసినోళ్లు.



(నా కెమెరా క‌న్ను క్లిక్‌మ‌నిపించిన ఛాయాచిత్రాల‌కు... జ‌త‌కూర్చిన‌ నాలుగు అక్ష‌రాలు - న‌మ‌స్తే తెలంగాణ‌లోని క‌థ‌నం)

పహాడ్ కీ కహానీ



భాగమతి - కులీ కుతుబ్‌షాల‌ ప్రేమ గీతం
రాతి శిలలు పలుకు రాగాల ఝురి
నగారాలు వినిపించే ఫర్మానాలు కొన్ని
నిర్మాణాల వెనక దాగిన కథాకమామీషులెన్నో
యే హైదరాబాద్ కీ కహానీ


ఇందు మూలంగా... 
నగర జనులకు తెలియజేయునది ఏమనగా....

అదిగో... నౌబత్‌ప‌హాడ్ నగరా మోగింది. అప్పుడే ఆల్ ఇండియా రేడియో రాగమొత్తుకుంది. ఫతే మైదాన్లో పావురాల గుంపు రివ్వున గాలిలోకెగిరింది. టౌన్‌హాల్ ముందు బాపూ బొమ్మ మౌనంగా వింటూనే ఉంది. ట్యాంక్‌బండ్‌ విగ్రహాలు ఠీవీగా నిల్చున్నాయి. సాగర మధ్యన బుద్ధుడు ధ్యానం వీడాడు. బిర్లా టెంపుల్లో బాలాజీ చిరునవ్వులొలికాడు. ఇంతకూ... ఏం వినాలని? ఔరంగజేబు ఫర్మానాలు వినేందుకు కాదు.. పహాడ్‌పై పుట్టిన పురాస్మృతుల్ని వినేందుకు. నాలుగు వందల ఏళ్ల నగర గాథ వినేందుకు. అవును... ఆదివారం ఉదయం వినిపించిన ఏ స్టోరీ ట్రైల్ ఆఫ్ నౌబత్ పహాడ్ నడక అది.



వందలాది పాదాల వడి వడి నడక. దారి వెంట రాలుతులున్న రాగాలు కొన్ని. పాటకు పాటకూ మధ్య పాత జ్ఞాపకాలు కొన్ని. నవాబులు... షరాబులు.. గరీబులు. తవ్విన కొద్దీ తారసపడే పాత్రలు ఎన్నో. కుతుబ్‌షాహీలు... తానీషాలు.. అసఫ్‌జాహీలు.. ఎందరెందరో ఏలిన ప్రభువులు.. ఎందరెందరో పాలిత ప్రజలు. కళ్లముందు కదలాడే చరిత్ర అది. అవును.. దీపా కిరణ్, గోపాలకృష్ణ వినిపించే కథలు.. మనల్ని చరిత్రలోకి నడిపించుకెళ్తాయి. అక్కడ... భాగమతి కాలి అందెల సవ్వడి వినిపిస్తుంది. కులీ కుతుబ్ షా కవన ఝురి ప్రవహిస్తుంది. ఔరంగజేబు అశ్వక దళమూ... ఉస్మాన్ అలీ ఖాన్ కళాతృష్ణ కనిపిస్తుంది. మధ్య మధ్యలో కృష్ణ దేవరాయుడు, తెనాలి రామకృష్ణులూ తారపడతారు. పరమానందయ్య శిష్యులూ పలకరిస్తారు. ఆదివారం హైదరాబాద్ ట్రాయిల్స్, స్టోరీ ఆర్ట్స్ ఇండియా నిర్వహించిన వాక్లో అలాంటి కథలెన్నో వినిపించాయి.

ఏటవాలు నడక
రవీంద్రభారతి మీదుగా అసెంబ్లీని దాటుకొని వెళ్తుంటే... గన్‌పార్క్‌ నిన్నటి జ్ఞాపకాలని పంచుతుంది. అలా ఎడమ వైపు మలుపు తిరిగితే... దారికి ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం. నడక ఏటవాలుగా సాగుతుంటుంది. కాస్త ఎత్తుకు వెళ్తామా... ఎదురుగా శిథిల భవనమొకటి తారసపడుతుంది. ఒకనాడు దగదగలతో వెలుగొందిన హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్ అది. పాపం పర్యాటక శాఖ మాత్రం ఏం చేస్తుంది! చుట్టూ ఓ కంచెను కట్టి వదిలేయడం తప్ప. వానకారు కోయిలలా చిన్నబోయిన ప్యాలెస్ పాత గోడలు. నిన్నటి వైభవోపేత స్మృతుల్ని నెమరేస్తుంటాయి. సరిగ్గా వందేళ్ల క్రితం.. నిజాం ఏలికలో ప్రధాన న్యాయమూర్తి సర్ నిజామత్ జంగ్ నిర్మించిన ప్యాలెస్ అది. చానాళ్ల పాటు నగర అభివృద్ధి బోర్డు కార్యాలయంగా సేవలందించిన భవనమూ అదే. కానీ ఇప్పుడు అదంతా జ్ఞాపకమే.


నగరా మోగిన వేళ
అదిగో... హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్ దాటుకొని వెళ్లి... అలా ఎడమవైపు తిరిగితే.... అక్కడే నౌబత్ పహాడ్. పరిసర ప్రాంతాల కంటే.. ఇంచు మించు 300 అడుగుల ఎత్తున. ఆ గుట్ట మీద బిర్లా ప్లానిటోరియం. కాస్త అటు పక్కనే బిర్లా మందిరూ. ఈ పహాడ్ ముచ్చట్లేంటో తెలుసా... అప్పుడెప్పుడో ఔరంగజేబు రోజూ ఈ గుట్ట మీదికి వచ్చే వాడంట. గుట్టపైన పెద్ద నౌబత్ (డ్రమ్, డోలు, నగారా) ఉండేదట. దాన్ని మోగించి ప్రజలకు ఇక్కడి నుంచి ఫర్మానాలు జారీ చేసేవారట. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది. అంతే కాదు... ఆమీర్ అలీ అనే బంధిపోటు నౌబత్ పహాడ్ నుంచి హుస్సేన్ సాగర్‌ని చూసి... మహాసముద్రాన్ని చూసినంత ఆనందించేవాడట. అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ టేలర్ రాసిన కన్ఫెషన్ ఆఫ్ ఏ థగ్ పుస్తకంలో నౌబత్ పహాడ్, హుస్సేన్‌సాగర్ గాథల్ని వివరించాడు. అవును మరి... రెండు నగరాల మధ్య గల మానవ నిర్మిత కాసారమది. నిజంగా అద్భుతమే.



ప్రణయ గాథలు
అంత ఎత్తున నక్షత్రశాల ఒకటి. అందులోకి అడుగు పెడితే ఎన్నెన్ని అద్భుతాలో. అవును... ఆకాశంలో నక్షత్రాలు మనతో ముచ్చటిస్తాయి. అలాంటి చోట.. దీపా కిరణ్ కథలో తెనాలి రామకృష్ణుడు తళుక్కున మెరుస్తాడు. ఇంతలో మోహిత్ గార్గ్ కులీ కుతుబ్‌షా  ప్రేమగీతం ఆలపిస్తాడు. మూసీ నది ఒడ్డున వికసించిన ప్రణయ గాథ. భాగమతి కాలి అందెల సవ్వడి... కులీకుతుబ్ షా కవన ఝురిని ఏకం చేసిన ప్రేమ గాథ. విని తీరాల్సిందే. ఆ ప్రేమ గాథ సాక్షిగా నిర్మితమైన ఈ నగరంలో... ఎన్నెన్ని అందాలు. ఎన్నెన్ని జాపకాలు. ఎన్నెన్ని మెరుపులు. ఎన్నెన్ని ఉరుములు. పూలతోటల.. ప్రేమ కథల... ఎత్తైన గుట్టల... రాజ్యం కదా ఇది. అప్పుడెప్పుడో అమాయకుడు చిత్రంలో పట్నంలో శాలిబండ... పేరైనా గోలుకొండ పాట వినుంటాం కదా. అది నిజమే.. ఒక్క నౌబత్ పహాడ్... గోల్కొండే కాదు.. ఇక్కడి అణువణువు ఓ కథ వినిపిస్తుంది. అది జగద్గిరి గుట్ట, చాంద్రాయణ గుట్ట, పార్శి గుట్ట, అడ్డగుట్ట, మౌలాలీ గుట్ట ఏదైనా కావచ్చు... అది నౌబత్ పహాడ్, కాలా పహాడ్, హకీషా కీ పహాడ్, గోల్కొండ, నయా ఖిల్లా, పహాడీ షరీఫ్ లూ కావచ్చు.. లేదా... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాగార్జునా హిల్స్ (పంజాగుట్ట), హిల్ ఫోర్టు, రెడ్ హిల్సూ కావచ్చు... అడుగడుగునా... ఓ తోట కనబడినట్లే... ఓ గుట్ట కనిపిస్తుంది. అటు వైపు అడుగులేస్తే... అది వినిపించే కథలో.. నవాబులో, పైగాలో, ప్రధానులో ఉండనే ఉంటారు.

(న‌మ‌స్తే తెలంగాణ కోసం రాసిన అక్ష‌రాలు)

శోక గీతం


ఆశన్న ఊషన్న అన్నదమ్ములంట
ఆశన్న ఊషన్న తలకాయలను 
దుష్టులు లెవ‌రో న‌రికినార‌ట‌
కారిన నెత్తురు కత్తిపీర్లు
చిల్లిన నెత్తురు చిన్న పీర్లు
పేరిన నెత్తురు పెద్ద పీర్లు

దర్గాపై నల్ల జెండా.. లోపలినుంచి ఒక శోక గీతం. కన్నీళ్లు వరదలై పారే... ఒక మూకుమ్మడి రోదన. ఆలంపై తల వాల్చిన చిన్నారి చూపుల్లో... ఏదో ఆర్థ్రత. ఎవరి కోసం ఈ కన్నీళ్లు? ఎందుకీ విషాదం? తెరలు తెరలుగా ప్రశ్నలు. మది మదిలో పదిలమైన హుస్సేన్ జ్ఞాపకం కదా అది. నీతి కోసం నెత్తురు దారపోసిన ఓ నాయకుడి స్మరణ కదా. అవును.. బాద్‌షాహీ అసుర్ ఖానాలో అడుగు పెడితే ఇలాంటి దృశ్యమే కంటపడుతుంది. పదిరోజుల పాటు నెలకొన్న ఓ విషాద సన్నివేశవేషం ఇది. ఎప్పటికీ న్యాయమే గెలవాలనే ఆకాంక్షను ఎల్లడెలా చాటే మనుషులు వాళ్లు. ఆ నిండు మనుషుల మది పులకింతే మొహర్రం.



చరిత్రలో ఎన్నెన్ని విషాదాలో... ఎన్నెన్ని త్యాగాలో... ఎంతెంత నెత్తురొలికిందో. జ్ఞాపకాలను తవ్వే కొద్దీ... తగిలే గాయాలెన్నో. వాటన్నిటినీ తడుముతూ ఇప్పుడు నగరం శోకగీతం వినిపిస్తోంది. ఈర్షా ద్వేషాలు, పగలు, ప్రతీకారాల కంటే.. ప్రేమలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఒక సత్యాన్ని గెలిపించేందుకు త్యాగానికీ వెనకడాని మానవీయతను మననం చేసుకుంటోంది. అవును.. మొహర్రం మోసుకొచ్చే సందేశమిదే. తమ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జాపకాలను గుండెలనిండా పదిలపరుచుకున్న జనం. కన్నీళ్లతో నిండు జీవితాల్ని కాంక్షిస్తున్నారు.


కర్బలా నెత్తుటి జ్ఞాపకం
ఎప్పుడూ సందడిగా హుషారుగా కనపించే నగరం.. ఇప్పుడెందుకో విషాదంలో మునిగిపోయింది. ఆ మాటకొస్తే ఒక్క నగరమే కాదేమో... ఈ భూమిపై ఇస్లాంని విశ్వసించే ప్రజలందరూ ఇలాంటి విషాదంలోనే ఉండి ఉంటారు. ఎందుకా అనుకుంటున్నారా? 1400 వందల ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన హుస్సేన్ జ్ఞాపకాలవి. అవును... బీబీ కా ఆవాలలోనో, బాద్‌షాహీ అసుర్‌ఖానాలోనో అడుగు పెడితే కనిపించే ఆలంలు(పీర్లు) వినిపించే జ్ఞాపకాలవి. పీర్లకు కట్టిన దట్టీలు.. మెడలో వేలాడే గాజులు... కర్బలా కదనరంగాన్ని చూపుతాయి. ఆలంపై తలవాల్చి రోదించే నేత్రాల్లోకి తొంగి చూస్తే హుస్సేన్ నెత్తుటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. మహ్మద్ ప్రవక్త మరణానంతర పరిణామాలన్నీ కథలు కథలుగా వినిపిస్తాయి. ఒక్కరు ఇద్దరు ఇద్దరు కాదు... 72 మంది వీరుల త్యాగాలు. విషప్రయోగంతో ప్రాణమిడిచిన హసన్ జ్ఞాపకం.. వెన్నుపోటుతో అమరత్వం నొందిన హుస్సేన్ జ్ఞాపకం. మదీనా రాజ్య వారసత్వం కోసం యజీద్ మిగిల్చిన విషాదం. ఇప్పుడు నల్లజెండాలా మన కళ్లముందు.




మొహర్రం
కొత్త సంవత్సరం కదా.. వేడుకనుకునేరు. కానీ ఇది సంతాపం. అవును.. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ఆరంభమాసం మొహర్రం. కానీ ఇది ముస్లింకు వేడుక కాదు. విషాదం. మహ్మద్ ప్రవక్త మనువడు ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన మాసం. పది రోజుల పాటు యుద్ధంలో గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరక్క విలవిల్లాడిన గడ్డుకాలం. యజీద్ కుట్రకు 72 మంది తన సహచరులతో సహా బలియైన మాసం. అందుకే మొహర్రం మాసంలో పాత బస్తీలోని ప్రతి ఇంటి కప్పు మీద నల్ల జెండా ఎగురుతుంది. తమ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ వారి పేర్లమీద పీర్లను ప్రతిష్టిస్తారు. అసుర్‌ఖానాలో, దారుల్‌షిఫాలో, అలీజా కోట్లలోలో ప్రతీ చోట ఆ జ్ఞాపకాలే తారసపడతాయి.



త్యాగానికి ప్రతీక
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నర జాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహ సిక్తం అన్నట్లు.. ప్రపంచంలోని భాదితులందరీ ఒకే స్థితి అని చాటుతుంది మొహర్రం. ఆ చరిత్ర సాక్షిగా నగరం మొహర్రం పది రోజుల పాటు సంతాపదినాలు జరుపుకుంటుంది. ఏ వీథికేసి చూసినా... నల్ల జెండాలు. మొహర్రం మొహర్రం 6వ రోజు నుంచి 10 వ రోజు వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. యుద్ధ సమయంలో హుస్సేన్ అతని సహచరులు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ విలవిల్లాడి పోతారు. అలాంటి స్థితి ఎవరికీ రావొద్దని షర్బత్,ఎండు ఫలాలతో రొట్టెలు చేసి పంచుతుంటారు. షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ.. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మాతం(శోక ప్రకటన)లో పాలొంటారు. బీబీకా ఆలావా మొదలు.. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌజ్, మీరాలం మండి, దారుల్ షిఫాల మీదుగా చాదర్ ఘాట్ వరకు సాగుతుంది. పీర్లు... నిప్పుల గుండాలు... గుండెలు బాదుకునే సన్నివేశాలు.. శరీరాల్ని చీల్చే కుత్తులు... పారే నెత్తురు.. కలిసిన శోక గీతం ఇది. ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన సిద్ధాంతాన్ని వీడొద్దు అంటూ సందేశమిస్తుంది ఈ గీతం. 
(న‌మ‌స్తే తెలంగాణ కోసం రాసిన అక్ష‌రాలు)

Search for Sensitivity


వ్య‌వ‌స్థ‌లో క‌నుమ‌రుగైన‌ Sensitivity క‌నిపెట్టేందుకు ఏ కోర్టు త‌లుపు త‌ట్ట‌గ‌లం?


కోర్ట్ చిత్రంలో నారాయ‌ణ కాంబ్లే పాత్ర‌లో ఒదిగిపోయిన వీర సాతిదార్‌ని న‌టుడు అనే కంటే ఉద్య‌మ‌కారుడు అన‌డ‌మే స‌ముచితం. అవును... ఆయ‌న ప్ర‌స్థానం అలాంటిది. ఒక్క సినిమాతో దేశం దృష్టిని ఆక‌ర్షించిన వీర సాతిదార్‌ నిజ‌జీవితంలో ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డిన పాట‌గాడు. త‌న క‌లానికీ, గ‌ళానికి ఈ దేశ అట్ట‌డుగు ప్ర‌జ‌ల ఈతి బాధ‌లు బాగా ప‌రిచ‌యం. అందుకే... ఆయ‌న ద‌ళిత‌, ఆదివాసీ, మైనార్టీ స‌మూహాల గొంతుక‌గా మారాడు. క‌నుక‌నే "న‌న్ను యాక్ట‌ర్‌గా కాదు... యాక్టివిస్ట్ గా చూడండి" అన‌గ‌లిగాడు.
దేశం నుంచి 2016 ఆస్కార్ కి నామినేట్ అయిన మ‌రాఠి చిత్రం కోర్ట్‌లో వీర సాతిదార్‌ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. పోషించాడ‌నేకంటే... జీవించాడంటే బావుంటుందేమో. ఎందుకంటే... ఒక ర‌కంగా ఆయ‌న నిజ‌జీవితంలోని పాత్ర‌నే తెర‌మీద క‌నిపించేది కూడా. మ‌రోలా చెప్పాలంటే.. అలాంటి నారాయ‌ణ కాంబ్లే వీర సాతిదార్‌ మాత్ర‌మే కాదు... మ‌న‌లో ఎవ‌రైనా కావ‌చ్చు.

అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో చ‌ట్టం - న్యాయం నిసిగ్గుగా చేస్తున్న నేరాల్ని ప్రేక్ష‌కుల బోనులో నిల‌బెట్టిన చిత్రం కోర్ట్‌. భార‌తీయ సినిమా రంగంలో మ‌లుపుగా చెప్పుకోద‌గ్గ చిత్రం. సందేశాలు లేవు... నినాదాలు లేవు... ఆరోప‌ణ‌లు లేవు... ఆక్షేప‌ణ‌లూ లేవు... వ‌ర్త‌మానాన్ని వెండి తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే. ఎన్ని అవార్డుల‌ను గెలుచుకున్న‌ద‌నే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఎన్ని సున్నిత‌మైన విష‌యాల్ని త‌ట్టి లేపిందో? ఎన్నెన్ని ఆలోచ‌ల్ని రగిలించిందో? ఒక మౌనం.... ఒక చూపు.... ఒక మాట‌.... ఒక శ‌బ్ధం.... ప్ర‌తీదీ అంత‌ర్లీనంగా వ్య‌వ‌స్థీకృత‌మైన భావ‌జాలాన్ని స్పురింప‌జేస్తుంది. ఇది ఇండియా స‌మ‌స్య కాదు... ప్ర‌పంచం స‌మ‌స్య. న్యాయం ఎవ‌రి ప‌క్షమ‌నే ప్ర‌శ్న ఉద‌యించిన ప్ర‌తిచోట ఎదుర‌య్యే స‌మాధానం. న్యాయ‌మూర్తికి పోలీసు సాక్ష్యాలే క‌నిపిస్తాయి... ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వాద‌న‌లే వినిపిస్తాయి. తారీఖులు మీద తారీఖులు.... కోర్టు కాగితాలు చెద‌లుప‌ట్టాక‌.... కేసువీగిపోతుంది. జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చేలోపు రాజ‌ద్రోహం కేసు రెడీగుంటుంది. ఇంతే... కోర్టులంటే ఇంతే. చెద‌లు ప‌ట్టిన కాగితాల మ‌ధ్య న‌లిగిపోయిన జీవితాలెన్ని. జైలు గోడ‌ల నిండా కొట్టివేసుకున్న తారీఖులెన్ని. స‌మాధానం ఎక్క‌డ వెతుక్కోవాలి? ఒక్క‌సారి కోర్ట్ సినిమా చూస్తే మ‌నం ఇవాళ ఎలాంటి ప‌రిస్థితుల న‌డుమ జీవిస్తున్నామో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌దారి వీర సాతిదార్‌ గురువారం లామ‌కాన్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుద‌లైన మా స‌హ‌చ‌రుడు మారుతీని సాయంత్రం 7గంట‌ల‌కు జైలు గేటు ముందే మీడియా స‌మ‌క్షంలో పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 12గంట‌ల‌కు అనుమాస్ప‌దంగా సంచ‌రిస్తున్నాడంటూ అక్ర‌మ కేసులు మోపారు. కోర్టులో మా వాద‌న‌లు విన్న‌ న్యాయ‌మూర్తి "మీరు ముందు కోర్ట్ సినిమా చూడండి. అత‌డిని విడుద‌ల చేసి ముందు సీఐని లోప‌ల పెట్టండి.." అంటూ ఆదేశించారు. ఇది మా చిత్రం వేసిన ప్ర‌భావం" అన్నారు. భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థ సున్నిత‌త్వాన్ని విస్మ‌రిస్తుంద‌నే విష‌యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంద‌న్నారు. నిజ‌మే... ప్ర‌జ‌ల‌కు కావ‌ల‌సింది ఇలాంటి చిత్రాలే.


ప్ర‌ముఖ తెలుగు చిత్ర‌ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల సైతం ఈ సినిమా చాలా లోతైన విష‌యాన్ని అత్యంత సున్నితంగా విశ్లేషింద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కోర్ట్ కేవ‌లం మ‌రాఠి సినిమా మాత్ర‌మే కాదు.. ఇది అంత‌ర్జాతీయ సినిమా అని అన్నారు. ఏ సినిమాకైనా.... క్వాలిటీ, క్లారిటీ, ఫైనాన్షియ‌ల్ యాంగిల్‌తో పాటు సామాజిక బాధ్య‌త కూడా ఉండాల‌ని, అవి అన్నీ ఈ సినిమాలో ఉన్నాయ‌న్నారు. విర‌సం స‌భ్యులు వ‌ర‌వ‌ర రావు కోర్టు చిత్రంలో నారాయ‌ణ కాంబ్లే లాంటి మ‌నుషులు వంద‌లు, వేల సంఖ్యలో ఈ న్యాయ వ్య‌వ‌స్థ నిర్లిప్త‌త కార‌ణంగా జైలుగోడ‌ల మ‌ధ్య న‌లిగిపోతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తంగా సాహిత్య‌, సాంస్కృతిక రూపాల ద్వారా ఇలాంటి సున్నిత‌మైన విష‌యాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌నే వాస్త‌వాన్ని కోర్ట్ చిత్రం మ‌రోమారు గుర్తు చేస్తోంద‌నే చెప్పాలి.