Monday 16 November 2015

వ్యవస్థకు దర్పణం కోర్టు - విర సాతిదార్


-లోపిస్తున్న సున్నితత్వాల్ని తట్టిలేపే ప్రయత్నం
-నేను యాక్టర్‌ని కాదు... యాక్టివిస్ట్‌ని 

పాట చైతన్య ప్రవాహమవుతుంది. అది ప్రజల గుండెలను తాకి పోరాట నినాదమవుతుంది. అందుకే... రాజ్యానికి పాట అంటే భయం. అది గద్దర్ కావచ్చు... జీతన్ మరాండీ కావచ్చు... ఇప్పుడు కోవన్ కావచ్చు. నిర్బంధాలనో... నిషేధాలనో... ఎదుర్కోక తప్పదు. అలాంటి గాయకుడే నారాయణ కాంబ్లే. పాట పాడిన నేరానికి జైలు గోడల వెనక్కి నెట్టబడ్డవాడు. తారీఖులు మారేకొద్దీ నేరారోపణలు పెరుగుతూనే ఉంటాయి. జైలుగోడలు దాటుకొచ్చేలోపు రాజద్రోహం కేసురెడీగా ఉంటుంది. అవును.. ఇది ఇవాల్టి న్యాయవ్యవస్థ తీరు. కాకపోతే బోనులో మరెవరో కనిపిస్తారు. ఈ ముచ్చట ఎవరో చెప్పట్లేదు... కోర్ట్ సినిమా కథ చెబుతోంది. 2016 ఆస్కార్‌కి దేశం నుంచి నామినేట్ అయిన మరాఠి సినిమా. భారీ తారాగణాలు.. వందల కోట్ల బడ్జెట్... లెంత్తీ డైలాగ్‌లు కనిపించని సాదాసీదా సినిమా. 23 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న కోర్ట్ ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్త చూపునందిస్తోంది. అందులో నారాయణ కాంబ్లే పాత్రలో విర(విప్లవ రవూఫ్) సాతిదార్ ఆకట్టుకున్నారు. యాక్టర్‌గా కంటే యాక్టివిస్ట్‌గానే గుర్తించాలి అంటున్నారు ప్రజా వాగ్గేయకారుడు, విరోధి పత్రిక సంపాదకుడు, రిపబ్లికన్ పాంథర్స్ క్రియాశీలక కార్యకర్త విర సాతిదార్. 
-నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో

న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని బోనులో నిలబెట్టిన చిత్రం కోర్ట్. చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నినాదాలు లేవు... ఆరోపణలు లేవు... ఆక్షేపణలు లేవు. ఉన్నదల్లా వర్తమాన భారతం వెండితెరపై నడయాడుతుండడమే.  ప్రతి దృశ్యం ఏన్నెన్నో ఆలోచనల్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి శబ్ధం ఏదో రహస్యాన్ని వినిపిస్తుంది. మనందరికీ తెలిసిన రహస్యమే. వ్యవస్థీకృతమైన భావజాలాన్ని కళ్లకు కట్టి.. ప్రజాస్వామ్యంలో అమలవుతున్న అప్రజాస్వామ్యాన్ని మననం చేస్తుంది. అంతే... ఒక వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకునే ధైర్యం ఈ వ్యవస్థకు ఉందా? అనే ప్రశ్నిస్తుంది. అలాంటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన విర సాతేదార్ తన అనుభవాల్ని నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...

న్యాయ వ్యవస్థ స్థితి
నేను కోర్ట్ సినిమాలో నారాయణ కాంబ్లే పాత్ర పోషించాను. నిజ జీవితంలో కూడా నేను నారాయణ కాంబ్లేనే. పాటను, ప్రజలను ప్రేమించినందుకు, రాజ్యాన్ని ప్రశ్నించింనందుకు నిర్బంధాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలాంటి స్థితిలో ఉందో తెలియజెప్పే చిత్రమిది. నిజానికి ఇది ఒక్క భారతదేశం స్థితి మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. కోర్ట్ పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించినప్పుడు అక్కడి దర్శకులు ఇదే మాటన్నారు. అందుకే... ఈ చిత్రానికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభించింది.


నేను యాక్టర్‌ని కాదు..
నిజానికి నేను యాక్టర్‌ని కాదు.. యాక్టివిస్ట్‌ని. స్వయంగా నేను కవి, రచయిత, గాయకుడిని కావడంతో చైతన్య తమ్హానే నారాయణకాంబ్లే పాత్రకు నన్ను ఎంపిక చేశారు. నేను నా జీవితంలో పాత్రనే సినిమాలోనూ పోషించాను అంతే. అందుకే నన్ను యాక్టర్‌గా కంటే ఉద్యమకారుడిగా గుర్తించడంలో నాకు సంతోషం. కాకపోతే ఈ సినిమా వేసిన ప్రభావం గొప్పది. మా సహచరుడు మారుతిని పోలీసులు అక్రమ కేసులో అరెస్టు చేసి నాగ్‌పూర్ జైలులో బంధించారు. బెయిల్‌పై విడుదలైన అతడిని జైలు గేటు ముందే మీడియా సమక్షంలో మళ్లీ అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. సాయంత్రం 7 గంటలకు అరెస్టు చేసిన పోలీసులు రాత్రి 12గంటలకు అనుమానాస్పదంగా తిరుగుతూ తారసపడ్డాడంటూ చార్జిషీటు నమోదు చేసి మరో అక్రమ కేసు నమోదు చేశారు. కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి తప్పుడు కేసులు మోపే ముందు కోర్ట్ సినిమా చూడండి. ముందు అతడిని విడుదల చేసి... ఆ సీఐని లోపల వేయండి అంటూ ఆదేశించాడు. కోర్ట్ సినిమా ప్రభావానికి ఇది ఒక ఉదాహరణ.

కార్మికుడిని... గాయకుడిని
మాది నాగ్‌పూర్‌కి ముప్పై కిలోమీటర్ల దూరంలో గల ఓ కుగ్రామం. పెద్దగా చదువుకోలేదు. అందుకే చిన్నప్పుడు పశువులను కాసేవాడిని. మా నాన్నకు అది నచ్చేది కాదు. దీంతో నాగ్‌పూర్‌కి వచ్చి అక్కడ రాగి ఫ్యాక్టరీలో చేరాను. కొంతకాలం హైదరాబాద్ జీడిమెట్ల ఫ్యాక్టరీలో కూడా పనిచేశాను. నాగ్‌పూర్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. రాజ్‌కుమార్ సినిమాలంటే చాలా ఇష్టం. కాకపోతే.. రోజూ సినిమాల కోసం డబ్బులు వెచ్చించడం కష్టంగా ఉండేది. అందుకే... సినిమాలు చూడడం తగ్గించి పుస్తకాలు కొనడం మొదలుపెట్టాను. అప్పుడు మాగ్జింగోర్కి అమ్మ పుస్తకం నా చేతికి దొరికింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన పుస్తకం అదే. అలా అభ్యుదయ సాహిత్యం నుంచి నాటకాలు, పాటల వైపు అడుగులేశాను. కార్మికోద్యమం, దళిత్ పాంథర్స్ మూవ్‌మెంట్ నుంచి ప్రస్తుత రిపబ్లికన్ పాంథర్స్ వరకు దళిత, ఆదివాసీ, మైనార్టీ ప్రజల సమస్యలే నా కార్యక్షేత్రం.


జ్యుడీషియరీలో లోపించిన సున్నితత్వం
కోర్ట్ సినిమా న్యాయ వ్యవస్థలో లోపించిన సున్నితత్వాన్ని తట్టిలేపుతుంది. ఎక్కడా ఏదో తప్పు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయలేదు. వర్తమానాన్ని కళ్లకు కట్టే ప్రయత్నమే చేశారు దర్శకులు. న్యాయం ఎలా అమలవుతోంది? గెలిచేదంతా న్యాయమేనా? శిక్ష అనుభవించే వాళ్లంతా నేరస్తులేనా? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో లభిస్తాయి. అందుకు కారణమవుతున్న వ్యవస్థ, ఆ వ్యవస్థలో భాగమైన మనుషులు తమలోకి తాము ఒకసారి చూసుకునే అవకాశాన్ని ఈ చిత్రం కల్పిస్తుంది. అంతే. ఇలాంటి సామాజిక ఇతివృత్తాన్ని తీసుకొని రూపొందించిన చిత్రం ఆస్కార్ వరకు వెళ్లడం సంతోషించదగ్గ విషయం. కళా సాంస్కృతిక రంగాలకు గల సామాజిక బాధ్యతను ఈ సినిమా గుర్తు చేస్తుంది.

అంతర్జాతీయ సినిమా
కోర్ట్ కేవలం మరాఠి సినిమా కాదు.. అంతర్జాతీయ చిత్రానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ సినిమాలో ఉన్నాయి. కమిట్‌మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా. ఇక లోతైన విషయాన్ని ఎంత సాదాసీదాగా చెప్పవచ్చో ఈ చిత్రం నుంచి నేర్చుకోవచ్చు. విషయాల్ని సున్నితంగా అర్థం చేయించే ప్రయత్నం. తెలుగు సినిమాయే కాదు.. భారతీయ సినిమా కూడా కోర్ట్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. తెలుగులో ఇలాంటి మంచి సినిమాలు రావల్సిన అవసరమూ ఉంది.
-శేఖర్ కమ్ముల, సినీ దర్శకులు

No comments:

Post a Comment