Monday 30 November 2015

మై ఏక్ ముసాఫిర్ హూ : థియేటర్ ఆర్టిస్ట్, ట్రావెలర్ అక్రమ్ ఫిరోజ్

నాకు సరిహద్దులు నచ్చవు

 

 

మతాలు, ప్రాంతాలు, మాంసాల గురించి పోట్లాడుకుంటున్న కాలంలో అతను మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. సరిహద్దులు లేని సమాజం గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసం... అన్వేషణ సాగిస్తున్నాడు. ఊళ్లు, నగరాలు, జిల్లాలు, రాష్ర్టాలు, దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేయాలని కలగంటున్నాడు. వరల్డ్ విత్ అవుట్ బార్డర్ అంటూ సైకిల్ పై సవారీ సాగిస్తున్నాడు.  సరిహద్దుల పేరిట సాగే యుద్ధాల్ని సవాల్ చేస్తున్నాడు. అందుకు జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చినా లెక్కచేయలేదు. పాకిస్తాన్, చైనా, టిబెట్, నేపాల్, భూటాన్ ఇలా దేశదేశాల సరిహద్దుల్లో తన స్వేచ్ఛాగీతాన్నాలపించాడు. థియేటర్ ఎట్ బార్డర్ అంటూ ఊరూరా నాటకాల్ని ప్రదర్శించాడు. అతడు ఎవరో కాదు.. హైదరాబాదీ థియేటర్ ఆర్టిస్ట్ అక్రమ్ ఫిరోజ్. 10వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టొచ్చిన అక్రమ్ ఈసారి మోటర్ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..



మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. సిటీ అరోరా కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. బీఎస్సీ జెనెటిక్స్. మధ్యలోనే వదిలేశాననుకోండి. నాకు నాటకాలంటే ఇష్టం. డిగ్రీ వదిలేశాక కొంతకాలం వాటితోనే గడిపాను. కొంతకాలం మీడియాలో చేశాను. ఈ క్రమంలోనే భిన్న సంస్కృతులు... ప్రాంతాలు... ప్రజలను గురించి తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. అందుకోసం దేశంలోని వేరువేరు ప్రాంతాలు చుట్టిరావాలనుకున్నాను. కానీ అందుకయ్యే వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత కూడా లేదు. అప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకున్నాను. సైకిల్ మీదే దేశాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకున్నాను. వేరువేరు ప్రాంతాలను, ప్రజలు, సంస్కృతులు, సమస్యల్ని అధ్యయనం చేసేందుకు కూడా సైకిల్ యానం సరైందనిపించింది. అలా నేను 2011లో నా సైకిల్ జర్నీ ఆరంభించాను. ఈ ప్రయాణంలోని అనుభవాలే కొత్త ఆలోచనలకు... అన్వేషణకు పునాది వేశాయి. 



10వేల కిలోమీటర్లు...
అలా మొదలైన ప్రయాణం దాదాపు 10వేల కిలోమీటర్లు సాగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అండమాన్, లక్షద్వీప్, మహారాష్ట్ర ఇలా దక్షణాది రాష్ట్రాలన్నీ సైకిల్ మీదే తిరిగాను. ట్రక్కులు, లారీలు లిఫ్ట్ తీసుకుంటూ మరో 60 వేల కిలోమీటర్లపైనే ఈ నాలుగేళ్లలో తిరిగాను. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు చాలా గొప్పవి. ఆకలి దప్పులు, రోగాలు నొప్పులు వంటివి సాధారణ విషయాలే. కానీ... నిత్యం కొత్తకొత్త సమస్యలు ఎదురయ్యేవి. అయినా నేనెప్పుడూ నా జర్నీ సాఫీగా సాగుతుందని ఆశించలేదు. ఈ ప్రయాణంలో నన్ను ఆదరించి ప్రజలు... వాళ్లు పంచిన ప్రేమ గొప్పది. కాకపోతే.. నాలాంటి ఒక బాటసారి పట్ల ఈ వ్యవస్థ వైఖరి నన్ను పదే పదే ఆశ్చర్యానికి గురిచేసేది. వెళ్లిన ప్రతీచోట ఎక్కడినుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం ప్రయోజనం? ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యేవి. వీటికి తోడు కొన్నిచోట్ల  ఆంక్షలుండేవి. ఇక్కడ తిరగొద్దు... అటు వెళ్లొద్దు లాంటివి. ఈ ప్రశ్నలు.. ఈ ఆంక్షలే నాలో కొన్ని ఆలోచనలు లేవనెత్తాయి. 



ఎందుకీ సరిహద్దులు
గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లేకొద్దీ సరిహద్దుల సమస్య ఎదురయ్యేది. ఇది మన రాష్ట్రం.. అది పరాయి దేశం ఇలా. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లకూడదు లాంటి ఆంక్షలు. ఎందుకనే ప్రశ్నకు సరైన సమాధానముండదు. ఈ ప్రపంచ పౌరుడిగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా విహరించే హక్కు నాకుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ ఆర్టికల్ 13(2)ప్రకారం స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ దాన్ని ఏ దేశమూ అనుమతించదు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలంటుంది. కానీ నా వద్ద వరల్డ్ పాస్‌పోర్ట్ ఉంది. నేను నా కాళ్లతో నడిచి ఈ ఊరి నుంచి మరో ఊరికి వెళ్తున్నాను. అందుకు నీకెందుకు డబ్బులు చెల్లించాలి? నీ అనుమతి ఎందుకు తీసుకోవాలి? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న కేంద్రంగానే ప్రయాణం సాగుతూ వచ్చింది. 



సైకిల్ నాటక్
నేను వెళ్లే ప్రతిచోట స్థానిక సమస్యల్ని తెలుసుకోవడం, అక్కడి పిల్లలతో కలిసి నాటకాల్ని ప్రదర్శించడం ఆరంభించాను. అదే సైకిల్ నాటక్. ఇలా కొత్త విషయాల్ని తెలుసుకుంటూ కొత్తకొత్త నాటక రీతుల్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటాను. చైనా - ఇండియా బార్డర్, పాకిస్తాన్ -ఇండియా బార్డర్, భూటాన్ ఇండియా బార్డర్, నేపాల్ -ఇండియా బార్డర్‌లో ఇలా అనేక ప్రదర్శనలు చేశాను.  స్థానిక ప్రజల్ని, పరిసరాల్ని నాటకంలో భాగం చేస్తూ... ఇన్‌విజిబుల్ థియేటర్ ప్రయోగం చేశాను. ఈ క్రమంలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యాయి. ప్రమాదాలు జరిగాయి. అండమాన్‌లో 20ఫీట్ల ఎత్తు నుంచి లోయలో పడ్డాను. సైకిల్ పాడైపోయింది. రోడ్డుపక్క ఎవరో తాగి గొడవ పడతారు. నా కెమెరా దొంగిలించారు. అనారోగ్యం బారినపడ్డాను. నేను లిఫ్ట్ తీసుకున్న వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. ఇలా ఎన్నో. అయినా ప్రతీచోట ప్రజలు ఏదో రూపంలో నన్ను ఆదరించారు. వాళ్ల అనుభవాలను, అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. నా ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని అందించారు. అందుకే ఇన్ని వేల మైళ్లు ప్రయాణం చేయగలిగాను. 


జైలు గోడలు
గత ఆగస్టులో రాజస్తాన్‌లో పర్యటిస్తున్నాను. జగల్ మేర్ జిల్లా రాంఘడ్ పట్టణం. పాకిస్తాన్ సరిహద్దుకి 30కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పిల్లలతో నాటకం వేసి తిరిగి వెళ్తుండగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నందుకు అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నన్ను నేను కళాకారుడిగా, ట్రావెలర్‌గా పరిచయం చేసుకున్నప్పటికీ వాళ్లు విశ్వసించలేదు. ఎలాంటి చార్జిషీట్ లేకుండా 8 రోజుల పాటు కస్టడీలో ఉంచుకున్నారు. తరువాత 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మా అన్నయ్య అక్కడి వచ్చి బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టులో ఫైల్ స్వీకరించేందుకు తిరస్కరించారు. చివరకు హక్కుల సంఘాల చొరవతో బెయిల్ పిటిషన్ స్వీకరించి రెండువారాల తరువాత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. సరిహద్దులుండొద్దన్నందకు జైలుగోడల మధ్యకు వెళ్లాల్సి వచ్చింది. రంగు, రూపు, జాతి వేరు కావచ్చు కానీ అందరూ మనుషులే. వాళ్ల మధ్య హద్దుల్ని గీసి... యుద్ధాలు చేసుకోవడం ఎందుకు? అభిప్రాయ బేధాలుంటే... చర్చించుకోవాలి తప్ప యుద్ధాలు చేసుకోవద్దు. సమానత్వం కోసమే సంఘర్షణ అంతా. మనం సమానత్వం సాధించే నాటికి మనుషులు మిగలకపోతే? అలాంటి స్థితి రాకూడదనే ఆ ఆకాంక్ష. నేను సామాన్య కళాకారుడిని. కళకు ఎల్లలుండవు. నేను అదే విశ్వసిస్తాను. అందుకోసమే నా ఆరాటం. 



మరో ప్రస్థానం
జైలు నుంచి వచ్చాక నాలుగు నెలలు విరామం తీసుకున్నాను. ఈ సారి నా ప్రయాణం బైక్‌మీద. దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నాను. స్విట్జర్లాండ్‌కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ లియా కూడా ఈ ప్రయాణంలో నాతో పాటు వస్తోంది. మేము రూపొందించిన ది లోన్ కాంక్వెరర్ నాటకాన్ని ఈ సందర్భంగా పలు పట్టణాల్లో ప్రదర్శించనున్నాం. యుద్ధం-శాంతి గురించి చర్చించే ఈ నాటకాన్ని వచ్చే రెండునెలల్లో పూణే, జైపూర్, భోపాల్, ఢిల్లీ, చంఢీఘడ్ నగరాల్లో ప్రదర్శిస్తాం. భోపాల్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో మా నాటక ప్రదర్శన ఉంటుంది. డిసెంబర్ 1న ఈ జర్నీ ప్రారంభమవుతుంది. జనవరి 31 వరకు సాగుతుంది.

No comments:

Post a Comment