Monday 30 November 2015

The City Never Sleep



భాగ్యనగరం..ముత్యాల రాశుల ఉద్యానవనం. రాతి శిలలపై వెలిసిన రాజ భవనాలిక్కడ.. నది ఒడ్డున నిలిచిన శ్వేత సౌధాలిక్కడ.. ఇరానీ రుచుల మలాయి మీగడలు... బిర్యానీ గుమగమలు... ఉస్మానియా బిస్కెట్లు.. ముషాయిరాల వాహ్వాలు. చెప్పుకునేవి..తెలుసుకునేవి ఎన్నెన్నో ఈ మహానగరంలో. అందుకే... హైదరాబాద్ అందమైన పాలరాతి శిల్పం. కవి గాయక కళా నిలయం. భాగమతి కాలి అందెల సవ్వడికి జతకూడిన కుతూబ్ గీతం ఈ నగరం. ప్యాలెస్‌లు, దేవ్డీలు, కోఠీలు, కమాన్‌లు, దర్గాలు, మందిరాలు ఇలా అడుగడుగునా కొలువుదీరిన కట్టడాలెన్నో ఈ నేల మీద. అవి వినిపించే చారిత్రక గాథలు ఎన్నెన్నో. నిద్రపోని చందమామని భుజానేసుకొని.. ఆదివారం రాత్రంతా పురాస్మృతుల్లో పయనించిందీ నగరం. వరల్డ్ హెరిటేజ్ వీక్‌లో భాగంగా హైదరాబాద్ ట్రాయిల్స్ నిర్వహించిన నైట్ వాక్‌లో... వందలాది మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విదేశీయులు చార్మినార్ చెంతచేరి చరిత్రతో కరచాలనం చేశారు. అలా నిషీధి   రేయి ఉషారు గీతం ఆలపించింది నిద్రపోని నగరం.


నది ఒడ్డున నిల్చున్న అతని మదిని ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. ఎదురుగా ఉస్మానియా దవాఖాన. ఇంచుమించు వందేళ్ల వయసుంటుంది కాబోలు. ఎన్ని లక్షల ప్రాణాలిక్కడ పదిలమయ్యాయో. ఎన్ని శ్వాసలిక్కడ ఆగిపోయాయో. ఎన్నెన్ని జీవితాలు... ఇక్కడి నుంచే ఆరంభమయ్యాయో. చూడముచ్చటైన నిర్మాణం కదా... నిజాం ఆలోచనకు రూపురేఖలిచ్చిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ విన్సెంట్ ఇన్నేళ్లుగా నగరంలో సజీవంగానే ఉన్నట్లుంది. రేపటిసంగతేమో కానీ... ఇప్పటికైతే అతనికిది నది ఒడ్డున దిగిన పాలపుంత. ఇంతలోనే ఎవరో పిలిచినట్లుగా.. పురానాపూల్ దాటుకొని సాలార్జంగ్ మ్యూజియం వైపు అడుగులేశాడు. అదిగో...లోపలి నుంచి ఏవేవో శబ్ధాలు. చరిత్రని సజీవంగా పదిలపరిచిన వస్తుసామగ్రి గుసగుసలు. కాస్తముందుకెళ్లి నయాబ్ హోటల్ చేరుకున్నాడు. అంతే...వెలుగు పూల జాతరలో కలియతిరిగేందుకు రెండు పాదాలకు తోడు రెండు వందల పాదాలు జతకూడాయి.




ఇరానీ గుమగుమలు..
యే షహర్ నిషానీ హై ఇరానీ చాయ్. నయాబ్ హోటల్‌లో నడక సాగిస్తే... మలాయి పౌనా గుమగుమలు మనసును మెలిపెడతాయి. వంట గదిలో రుమాలీ రోటీ గాలిలోకెగురుతుంటుంది. కట్టెల పొయ్యి మీద మరుగుతున్న పాలు...మత్తుగొలుపుతాయి. కప్పులో చాయ్‌ని గుటకేసేలోపు గోపాలకృష్ణ ఏవేవో కథలు వినిపించాడు. యే షహర్ కీ కహానీ.. రెపరెపలాడే జెండాపై కుల్చా ఎందుకు కొలువుదీరిందో... ఏడు తరాల నిజాం కథని నిమిషాల్లో వినిపిస్తాడు. నయాబ్ హోటల్ వెనక గల్లీలోంచి నడుస్తు ఉంటే...చత్తా బజార్ చరిత్ర మనకు తారసపడుతుంది. తొలినాటి ముద్రణ ముచ్చట్లు ఔరా అనిపిస్తాయి. 



చరిత్రలోకి..
మదీనా వైపు అడుగులేస్తుంటే... పత్తర్‌గట్టీ పలకరిస్తుంది. చుట్టుపక్కల చూపు సారిస్తే... కాస్త దూరంగా దివాన్‌దేవ్డీ దర్శనమిస్తుంది. మీర్ చౌక్ రోడ్డు మురిపిస్తుంది. ప్రతి కట్టడానికీ ఓ కథ ఉన్నట్లే... గల్లీ గల్లీ ఓ గాథ ఉంది. నాటి ఊసులన్నిటినీ కళ్లముందు కుప్పపోసి ఒక్కొక్కటి వినిపించింది అరుణిమా. చార్మినార్‌కు నలుదిక్కులా నిలిచిన ద్వారాలు స్వాగతమంటాయి. కాలీ కమాన్ చెప్పే కథలు వింటూ...మచిలీ కమాన్ ముచ్చట్లు వింటూ... షేర్ ఏ బాటిల్ కమాన్...లోంచి చార్ కమాన్ వైపు నడక సాగిస్తే నాలుగు వందల ఏళ్ల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. దారి మధ్యలో రోడ్డుపక్కన టిఫిన్ బండి, అక్కడ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ నోరూరిస్తాయి.



వెలుగు పూలు..
చార్మినార్ చెంత చేరితే... వెలుగు పూలు స్వాగతమంటాయి. నక్షత్రాల నీడలో చందమామతో చెలిమి చేస్తూ నిశ్చలంగా నిలుచున్న నాలుగు వందల ఏళ్ల నగర నిశానీ ఇది. పక్కనే మక్కా మసీదు... ముచ్చటగా పిలుస్తుంది. ఎదురుగా యునానీ ఆసుపత్రి పాలపుంతలా వెలుగుతుంది. వారెవ్వా ఇన్ని అందాల్ని ఎక్కడ చూడగలం. ఒక్క బాగ్‌నగర్‌లో తప్ప. రాతిరంతా మేల్కొని.. చందమామకు సోపతిగుండే సిటీ ఇది. ఇంత అందమైన నగరంతో ప్రేమలో పడని వారెవరుంటారు. అందుకే... రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలు...దేవకొండ బాలగంగాధర్ తిలక్.... సరోజినీ నాయుడు వరకు ఎందరెందరో కవులు...నగర అందాలకు తమ అక్షరసుమాలర్పించారు. మీరూ ఈ రాత్రిపూల వెలుగులో నగర అందాల్ని వీక్షించాలనుకుంటున్నారా..! అయితే పాతబస్తీ వైపు పాదాల్ని తిప్పండి.


No comments:

Post a Comment